Friday, September 3, 2010

పుటుక్కు -జర -జర -డుబుక్కు -మే

మనలో చాలా మందికి తెలిసిన కథే ఇది... కానీ ఉన్నట్టు ఉండి గుర్తు రావడంతో ఇలా సమర్పించాలి అనిపించింది. అసలు ఈ మాట - మరి దీని భావమేమి తిరుమలేశా అంటే?

అనగనగా ఒక ఊర్లో ఒక ఇల్లు ఉంది. దానికి నాలుగుప్రక్కలా పెంకులతో ఏటవాలు ఇంటి కప్పు, మధ్యలో చావడి ఉన్నాయి. ఆ పెంకుల మీద ఒక గుమ్మడి పాదు వ్యాపించి ఉంది. మరి గుమ్మడి పాదు అన్నాక దానికి బోలెడు గుమ్మడి కాయలు ఉండాలి కదా....! అలాగే ఉన్నాయి.

ఆ ఇంటి కప్పుల్ని ఇల్లుగా చేసుకుని ఆ గుమ్మడి కాయలతో పాటు, ఒక ఎలక కూడా ఉంది. సరే ఒక రోజు చావడిలో ఒక మేకపిల్ల గడ్డి మేస్తూ ఉంది, ఇంతలో మన ఎలుక గారు ఒక గుమ్మడి కాయని పుటుక్కున కొరికింది. ఆ గుమ్మడి కాయ జర జరా జారుతూ, డుబుక్కున గడ్డి మేస్తున్న మేక పిల్ల మీద పడింది. వెంటనే ఆ మేక పిల్ల మే... మే.. అని అరిచింది అన్న మాట.

అదీ పుటుక్కు -జర -జర -డుబుక్కు -మే కథ.

-చిన్నా

Tuesday, August 31, 2010

ఆ క్షణాలు .....

నేల రాలే కొండమల్లి పూలకోసం
ఇంకా నిన్న కాక మొన్న
దోసిలి పట్టి నిలబడినట్టే ఉంది.
కలువపూల కోసం నీటిలో దిగి
కాలిపట్టా పోగొట్టుకున్నట్టే ఉంది.
సీతారాముల పందిరిలో
నేలపై పట్టా పరిచి
తెల్లార్లూ నాటకం చూస్తున్నట్టే ఉంది.
సీతతుమ్మ గింజల్ని అగ్గిపెట్టెలో పెట్టి
బంగారం అవాలని
మంత్రం వేసినట్టే ఉంది.
అడుక్కునే వాడు రావడమే ఆలస్యం
అమ్మను తొందరపేట్టి
గుప్పెడు బియ్యం పట్టుకుని
గుమ్మంలోకి పరిగేత్తినట్టే ఉంది.
ఏ క్షణంలో పోయిందో రెక్కలు కట్టుకుని
ఆ బాల్యం తుర్రుమని ఎగిరిపోయింది.
అర్థంలేని కబుర్లకి కూడా
ఫక్కున నవ్వుకుంటూ
నేస్తాలతో జట్టుకట్టి తిరిగిన
అంత నవ్వూ ఏమయిందో
పెదాలు కురచగా
ముడుచుకుపోయాయి.
ఏ కష్టం విన్నా అయ్యో అని
తడితడిగా అయ్యే గుండె
అంత చెమ్మా ఏమైపోయిందో
కదలని బండ రాయైపోయింది.
కాలంతోపాటు పరుగెత్తే యంత్రంలా
పదీ టూ అయిదుగా మారిన
పరిణామ క్రమంలో
ఆ మెటామార్ఫాసిస్ లో
గొంగళి పురుగు సీతాకోకచిలుకగా
అవ్వాల్సిందిపోయి సీతాకోక చిలుకే
గొంగళి పురుగైపోయింది.
మరబొమ్మగా కాక మనిషిగా ఉన్న
ఆ క్షణాలు ఎప్పుడు వేళ్ళ సందుల్లోంచి
నిశ్శబ్దంగా జారిపోయాయో
ఇప్పటికీ వాటి జాడకోసం
ఆ క్షణాల చప్పుడు కోసం
వెదుకుతూనే ఉన్నా!

-చిన్నా